తొలిరోజు తడబడ్డ భారత బ్యాట్స్ మెన్స్

భారత్-శ్రీలంక జట్ల మధ్య మొదలైన తొలిటెస్టు తొలిరోజు ఆటను సాఫీగా జరగకుండ  చేసింది వర్షం. గురువారం ఉదయం 9 గంటలకు మొదలవాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా మధ్యాహ్నం 12.45 గంటలకు మొదలైంది .టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ దినేష్ చండీమల్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే ఇక్కడ టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ బౌలింగ్ ఎంచుకోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన చివరి 16 టెస్టుల్లో టాస్ గెలిచిన ఏ కెప్టెన్ కూడా ముందుగా బౌలింగ్ ఎంచుకోలేదు.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. శ్రీలంక బౌలర్ లక్మల్ ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను పెవిలియన్ చేర్చాడు. వికెట్‌ కీపర్‌ డిక్విల్లాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఖాతా తెరవకుండానే భారత్ వికెట్ కోల్పోయింది. రాహుల్‌ డకౌట్‌గా అవుటైన తర్వాత పుజారా క్రీజులోకి వచ్చాడు. అనంతరం 6.2వ ఓవర్లో లక్మల్‌ వేసిన బంతికి ధావన్‌(8) బౌల్డయ్యాడు.

ఆ తర్వాత వచ్చిన కోహ్లీ క్రీజ్ లో నిలదొక్కుకోవడానికి  ఇబ్బందిపడ్డాడు.కోహ్లీ 11 బంతులాడి పరుగులేమి చేయకుండానే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో భారత్ 17 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత్ కోల్పోయిన మూడు వికెట్లు కూడా శ్రీలంక బౌలర్ లక్మల్‌కే దక్కాయి. 6 ఓవర్లు వేసిన లక్మల్‌ ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా పదునైన బంతులతో భారత టాప్‌ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. తొలిరోజు11.5 ఓవర్లు ఆడిన టీమిండియా 3 వికెట్లు కోల్పోయి కేవలం 17 పరుగులు మాత్రమే చేయగలిగింది.

 

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *